వృద్ధాప్య పింఛను రూ.మూడు వేలకు పెంపు...జగన్
రాష్ట్రంలొని సమసలన్నీ తీరాలంటే ఏడాదిన్నర పాటు ఓపిక పట్టాలని వైసిపి అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లి శివారు ఎస్‌సి కాలనీ వాసులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాల పథకంలో మార్పులు, చేర్పులకు సలహాలు ఇవ్వాలని ప్రజలను కోరారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు కరెంటు బిల్లు ఎంత, ఇప్పుడు ఎంత వస్తోందని అక్కడున్న వారిని అడగగా దీనికి వారు ఐదు వేళ్లను చూపించి రూ.500కు పైగా వస్తోందని సమాధానమిచ్చారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్‌సి, ఎస్‌టిల ఇళ్లకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాలుగేళ్ల బాబు పాలనలో ఒక పక్కా ఇళైనా ఇచ్చారా, వృద్ధాప్య పింఛన్లు వస్తున్నాయా అని ప్రశ్నించారు. మీ ఆశీస్సులు, దీవెనలు ఫలిస్తే పక్కా ఇళ్లు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమాల్ని అందరికీ అందిస్తానని తెలిపారు. వృద్ధులకు రూ.మూడు వేలు పింఛను ఇవ్వడానికి ప్రయత్నిస్తానని హామీ నిచ్చారు. మా నాన్న హయాంలో 12 లక్షల ఎకరాలు పంపిణీ చేశారని, మనందరి ప్రభుత్వం వస్తే నాన్న కంటే లక్ష ఎకరాలు అదనంగా మంజూరు చేసి పేదలగుండెల్లో నాన్నతో పాటు తాను చిరస్థాయిగా నిలిచిపోవాలని ఉందని చెప్పారు. అంతకుముందు జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర మంగళవారం రెండోరోజు 12.6 కిలోమీటర్ల దూరం నడిచారు